Tue. Sep 22nd, 2020

అధికార పార్టీ లీలలు..!

ప్రతిపక్ష పార్టీలో ఉంటే.. మాజీ మంత్రులకు, మాజీ ఎమ్మెల్యేలకు ఉన్న గన్‍మెన్‍లను ప్రభుత్వం తొలగించేసింది. దీనిపై కొంతమంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కోర్టుకు వెళ్లారు. అలా కోర్టుకు వెళ్లిన వారికి వెంటనే గన్‍మెన్‍ల సౌకర్యం పునరుద్దరించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదిగో ఇదిగో అంటూ బాధ్యత గల పోలీసు అధికారులు గన్‍మెన్‍లను కేటాయించేందుకు కాల యాపన చేస్తున్నారట. ఇదంతా ప్రతిపక్ష నేతలను ఇబ్బంది పెట్టేందుకు అధికార పక్షం చేస్తున్న తతంగాలు. తాజాగా మాజీ మంత్రి శిద్దారాఘవరావు తెలుగుదేశం పార్టీని వీడి జగన్‍ పార్టీలో చేరిన కొద్ది రోజులకే గన్‍మెన్‍ను కేటాయించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గన్‍మెన్‍లను తొలగించిన అధికారులే.. మళ్లీ ఆయన పార్టీ మారగానే గన్‍మెన్‍లను కేటాయించి అప్రతిష్ట పాలు అవుతున్నారు.

ఏయే కారణాలతో మాజీ మంత్రి శిద్దారాఘవరావు జగన్‍ పార్టీలో చేరారో కానీ ఆయనకు గన్‍మెన్‍ల సౌకర్యంతో పాటు ఇతర సౌకర్యాలు కూడా కల్పించబోతున్నారు. ఎప్పుడైతే.. శిద్దా జగన్‍ పార్టీలో చేరారో..ఆ రోజు నుండి మంత్రులు, ఉన్నతాధికారుల నుండి ప్రకాశం ఎస్పీకి మౌఖిక ఆదేశాలు అందాయట. నిన్న కాక మొన్న గన్‍మెన్‍లను తొలగించాం.. వెంటనే ఇస్తే… విమర్శలు వస్తాయి. పోలీసు యంత్రాంగాన్ని కూడా మీడియా తప్పుపడుతుంది. అని పోలీసు అధికారులు మొత్తుకున్నప్పటికీ జిల్లా ఎస్పీపై ఒత్తిడి తెచ్చి గన్‍మెన్‍లను పునరుద్దరించేటట్లు చేశారట. అధికార పార్టీయా మజకా నా అని స్థానిక ప్రజలు అంటున్నారు. ఎంత వేగంగా శిద్దాకు గన్‍మెన్‍లను తొలగించారో.. అంతే రెట్టింపు వేగంగా గన్‍మెన్‍లను ఏర్పాటు చేశారు. చివరకు జిల్లా ఎస్పీకూడా నిబందనలకు విరుద్దంగా నిర్ణయాలు తీసుకుంటూ అప్రతిష్ట పాలయ్యారని క్రింది స్థాయి అధికారులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *