Wed. Oct 21st, 2020

శ్రీవారి దర్శనాలకు బ్రేక్‍..!

ttd

ttd

తిరుమలలో యాభై మంది అర్చకులు ఉంటే.. అధికార పూర్వకంగా ఇరవై మంది అర్చకులకు కరోనా సోకిందని అధికారులు ప్రకటిస్తుండగా.. ఇంకా ఎక్కువ మందికి సోకిందని అనధికారికంగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితులున్న నేపధ్యంలో శ్రీవారి దర్శనాన్ని మళ్లీ కొంత కాలం నిలిపివేయాలని తిరుమల మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ట్విట్టర్‍ ద్వారా తెలిపారు. భక్తులెవరూ కరోనా బారిన పడలేదు. ఈ నేపధ్యంలో భక్తులకు దర్శనం యధావిధంగా కొనసాగుతాయని ఛైర్మన్‍ వైవి.సుబ్బారెడ్డి స్పష్టం చేస్తూ.. మొండి వైఖరి అవలంబిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. తిరుమల కొండపై కరోనా వ్యాధి ఎవరెవరికి సోకిందో కానీ శ్రీవారి దర్శనం మళ్లీ ప్రారంభించాకే ఆ వ్యాది సోకిందని రమణ దీక్షితులు గుర్తు చేస్తున్నారు.

రమణ దీక్షితులు చేసిన ప్రకటనకు విరుగుడుగా.. ప్రస్తుత ప్రధాన అర్చకుడు వేణుగోపాల దీక్షితులు అనుకూలంగా ఛైర్మన్‍ సుబ్బారెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డిలు ప్రసారం చేయిస్తున్నారని.. రమణ దీక్షితులకు అనుకూలవర్గమైన అర్చకులు విమర్శిస్తున్నారు. కరోనా వ్యాది తిరుమల కొండపై ఎలా వచ్చిందనే విషయంపై స్పష్టత ఇవ్వకుండా.. భక్తుల వలన కరోనా రాలేదు.. శ్రీవారి ఆలయం లోపల అర్చకులుంటారు. భక్తులకు మహా లఘు దర్శనం మాత్రమే ఉంది. కళ్యాణోత్సవ సమయంలో కూడా భక్తులెవరూ ఉండటం లేదు అని ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు చేసిన ప్రకటనల వెనుక ఛైర్మన్‍ సుబ్బారెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డిల ప్రభావం పనిచేసిందని రమణ దీక్షితులు అనుకూల వర్గాలు బాహాట0గానే చెబుతున్నాయి. అర్చకులకు కరోనా సోకింది. వారి కుటుంబాలకు కూడా ఈవ్యాది సోకే ఉంటుంది. కోరి కోరి ప్రమాదం తెచ్చుకోవద్దు. భక్తులకు కొద్దిరోజులు శ్రీవారి దర్శనం నిలిపివేయటం వలన నష్టం ఉండదు అని రమణ దీక్షితులు చెబుతున్నారు. టిటిడి అధికారులు చెప్పవలసిన విషయాలతో పాలక మండలి ఛైర్మన్‍ వైవి.సుబ్బారెడ్డి తెరపైకి ఎందుకు వస్తున్నారు అని టిటిడి క్రింది స్థాయి ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

పది వేల మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకుంటే.. వారిలో వందో లేక రెండు వందల మందికి మాత్రమే కరోనా పరీక్షలు నిర్వహించి వారికి పాజిటివ్‍ రాలేదని చెబుతున్నారే తప్ప మిగతా వారికి పరీక్షలు ఎందుకు నిర్వహించలేకపోయారు. మిగతా వారివలన కొండపై కరోనా ప్రవేశించవచ్చుగా అని రమణ దీక్షితులు అంటున్నారు. అధికార పూర్వకంగా పదిహేను మంది అర్చకులకు కరోనా వచ్చినా.. దర్శనాలు ఆపకపోవటంలో మర్మం ఏమిటి.?? యాభై మందికి చేసిన పరీక్షలలో ఇంకా 30 మందికి ఫలితాలు రాలేదు. వారిలో ఎంతో కొంత మందికి పాజిటివ్‍ వచ్చే ఉంటుంది. ఇప్పటికైనా దర్శనాలు ఆపండి అని ముఖ్యమంత్రికి రమణ దీక్షితులు విజ్ఞప్తి చేస్తుండగా.. ఎట్టి పరిస్థితుల్లో రమణ దీక్షితులు మాట చెల్లుబాటు కాకూడదనే పట్టుదలతో ఛైర్మన్‍ సుబ్బారెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డిలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఏది ఏమైనా తిరుమల కొండపై కరోనా పొంచి ఉందన్నది యదార్ధమే అని.. ఈ రోజు కొంతమందికే సోకింది. దాని వలన ప్రమాదం లేదు. భక్తులకు శ్రీవారి దర్శనం కలిగించటం వలన ఎలాంటి నష్టం జరగదు అని సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిల అభిప్రాయాన్ని పలువురు తప్పుబడుతున్నారు. శ్రీవారి దర్శనాలను రాజకీయం చేసింది ఛైర్మన్‍ సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిలే తప్ప తాను కాదని.. మాజీ ప్రధానఅర్చకులు, ప్రస్తుత టిటిడి ఆఘమ సలహామండలి గౌరవ అధ్యక్షులు రమణ దీక్షితులు చెబుతున్నారు. ప్రతి విషయానికి వైవి.సుబ్బారెడ్డి తెరపైకి రావటం .. ఈవో సింఘాల్‍ ఈ విషయంలో కలుగజేసుకోకపోవటం.. అదనపు ఈవో ధర్మారెడ్డి, సుబ్బారెడ్డికి వంత పాడటం పలు విమర్శలకు దారి చూపుతోంది. తిరుమలలో శ్రీవారి దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేయకుంటే.. అందుకు మూల్యం చెల్లించుకోక తప్పదని రమణ దీక్షితులు ఒక టివి ఛానెల్‍కు ఇచ్చిన ఇంటర్యూలో చెబుతూ.. ఈవిషయంపై ముఖ్యమంత్రి జగన్‍ సకాలంలో స్పందించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *