Wed. Oct 21st, 2020

శాసన మండలి కోసం క్యూ…

ap council

ap council

వైసీపీలో పాతతరం, కొత్త తరం, వ్రుధ్ధతరం నేతలు ఉన్నారు. వివిధ పార్టీలో పనిచేసి ఇపుడు అధికారంలో ఉంది కదా వైసీపీలో చేరిన వారూ ఉన్నారు. ఎవరు వచ్చినా ఎలా వచ్చినా అందరి ఆలోచనా ఒక్కటే. అదే పదవి. అధికారంలో ఉన్న పార్టీ పండ్లున్న చెట్టు. అందువల్ల కొమ్మను వంచి కోసుకోవాలని ఎవరి తాపత్రయం వారికి ఉంటుంది. ఇపుడు ఉత్తరాంధ్రాలోని వైసీపీ నేతల్లో కూడా ఎమ్మెల్సీ పదవులపైన ఆశలు చిగురిస్తున్నాయి. శాసనమండలి ఇప్పట్లో రద్దు కాదు అన్న ధైర్యం ఓ వైపు ఉంటే ఒక్క రోజు అయినా కుర్చీ ఎక్కాలన్న ఆశ మరో వైపు ఉంది. మొత్తానికి మేము పెద్ద మనుషులం కామా అని అరడజన్‍ మంది వైసీపీ ఆశావహులు రాజ్య సభ సభ్యుడు విజయసాయిరెడ్డి చుట్టూ చక్కర్లు కొడుతున్నారుట.వైసీపీలో చేరకముందు ఆరేళ్ల పాటు టీడీపీ తరఫున ఎమ్మెల్సీగా పనిచేయడమే కాదు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న మాజీ మంత్రి దాడి వీరభద్రరావు రెండవసారి అక్కడ తనకు ఎక్స్ టెన్షన్‍ ఇవ్వలేదనే వైసీపీ వైపుగా వచ్చారు.

సరే రెండు సార్లు పార్టీలో చేరిన ఆయనకు ప్రాధాన్యత ఎంతవరకూ ఉందో తెలియదు కానీ తన సీనియారిటీని గుర్తించమని ఆయన కోరుతున్నారు. డెబ్బయ్యేళ్ళ పైబడిన ఈ మాజీ మంత్రి ఎమ్మెల్సీగా ఉంటే హాయి అనుకుంటున్నారుట. తన పేరుని పరిశీలించాలని కోరుతున్నారుట.ఇక టీడీపీ అర్బన్‍ జిల్లా ప్రెసిడెంట్‍ పదవిని సైతం వదిలేసి జగన్‍ గూటికి చేరిన మైనారిటీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‍ ఎస్‍ ఎ రహమాన్‍ తనని ముస్లిం మైనారిటీ కోటాలో ఎమ్మెల్సీని చేయాలని కోరుకుంటున్నారు. పాతికేళ్ల క్రితం చట్ట సభలకు ఎమ్మెల్యేగా ఎన్టీయార్‍ పుణ్యమాని అసెంబ్లీలోకి అడుగుపెట్టిన రహమాన్‍ ఇప్పటిదాకా మళ్ళీ ఆ వైపు చూడలేదు. దాంతో ఆయన తనకు పదవి కావాలని కోరుతున్నారు. ఉత్తరాంధ్రాలో ఉన్న అతి పెద్ద మైనారిటీ లీడర్‍ గా తనకు అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. ఆయన కాకుండా విశాఖలో గతంలో వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లుగా పనిచేసిన కొయ్య ప్రసాదరెడ్డి, రామక్రిష్ణారెడ్డి వంటి వారు కూడా ఎమ్మెల్సీ ఇస్తే చాలు అంటున్నారు.ఇక శ్రీకాకుళం జిల్లా వైసీపీ ప్రెసిడెంట్‍, కేంద్ర మాజీ మంత్రి అయిన కిల్లి కృపారాణి తనకు ఎమ్మెల్సీ పదవి అయినా ఇస్తారని ఆశపడుతున్నారు.

నిజానికి ఆమె రాజ్యసభ సీటు కోసమే ఎదురుచూశారు. అయితే జగన్‍ ఎంపిక పూర్తిగా టాప్‍ లెవెల్లో సాగింది. ఇక మరో రెండేళ్ల వరకూ పదవుల భర్తీ ఉండదు, ఇక ఇపుడు అందుబాటులో ఉండేది కేవలం ఎమ్మెల్సీలు మాత్రమే. నామినేటెడ్‍ పదవుల కన్నా ఎమ్మెల్సీ అంటే గౌరవంగా ఉంటుందని ఆమె భావిస్తున్నారు. ఆమెతో పాటు శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసి ఓడిన దువ్వాడ శ్రీనివాస్‍ ఎమ్మెల్సీ ఇప్పించాలని కోరుతున్నారు. ఆయన జగన్‍ కి బాగా సన్నిహితమైన నేతగా పేరు తెచ్చుకున్నారు.ఇదే విధంగా విజయనగరంలో కూడా ఎమ్మెల్సీ మీద ఆశలు పెట్టుకున వారు ఉన్నారు. వారిలో రాజకీయ కురువృధ్ధుడు సాంబశివరాజు కుమారుడు సురేష్‍ ఉన్నారు. ఆయనకు నెల్లిమర్ల టికెట్‍ చివరి నిముషంలో తప్పించి బొత్స చుట్టానికి ఇచ్చారు. అప్పట్లో ఆయనకు ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు మరి ఇవన్నీ చూసుకుంటే ఎమ్మెల్సీ ఎవరికి ఇవ్వాలి, ఎందరికి ఇవ్వాలి అన్నదే పెద్ద చర్చ. మరి ఆశ అందరికీ ఉంటుంది. తీర్చాల్సింది జగన్‍. అందుకే అందరి చూపు ఆయన మీద ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *