Sat. Oct 24th, 2020

కరోనా దెబ్బకు.. ఇల్లు దాటని అధికార నేతలు

poliltician

poliltician

వివిధ జిల్లాలలో అధికార ప్రజా ప్రతినిధులు, అధికార పార్టీ నేతలు ఇల్లుదాటి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. తప్పనిసరి అయితేనే బయట పర్యటనలకు వెళుతున్నారు. అనుచరులను, కార్యకర్తలను ఇళ్లకు రావద్దని ఫోన్లలోనే మాట మంచి మాట్లాడుతున్నారట. నగరాలలో రెండస్తుల భవనాలలో ఉంటున్న ప్రజా ప్రతినిధులు పై అంతస్ధుకే పరిమితమవుతున్నారట. ఎవరైనా కార్యకర్తలు, సందర్శకులు వారిని కలిసేందుకు వస్తే.. సార్‍ కిందకు రావటం లేదు. వస్తారన్న నమ్మకం లేదు. ఏదైనా పని ఉంటే.. ఫోన్‍ చేసి మాట్లాడండి అని వ్యక్తిగత సహాయకులు చెబుతున్నారట. అత్యవసరం, తప్పనిసరి అయితేనే.. ఇల్లు, ఊరు విడిచి ప్రజాప్రతినిధులు పర్యటనలు చేస్తున్నారు. ఆ పర్యటనలు కూడా హడావిడిగా ముగించుకుని ఇంటికి వస్తున్నారు. చాలా మంది అధికార ప్రజాప్రతినిధులు, అమాత్యులు జిల్లాలలో ఉండటం లేదట. అందుబాటులో ఉంటే చాలా మంది వస్తుంటారు… పోతుంటారు ఎందుకు వచ్చిన తంటా అని ఎక్కడెక్కడికో వెళుతున్నారు.

ఎవరైనా కార్యక్రమాలకు పిలిచినా.. మేము జిల్లాలకు రాము అని చెబుతున్నారట. ప్రజా ప్రతినిధులకు, అమాత్యులకు అత్యంత సన్నిహితంగా మెలిగే వారు కూడా వారిని కలవలేకపోతున్నారు. కానీ ఫోన్లలో మాత్రం అందుబాటులోకి వస్తున్నారని వారి సన్నిహితులు చెబుతున్నారు. జిల్లాలలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపధ్యంలో.. అధికార రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధులు,కుటుంబ సభ్యుల ఒత్తిళ్లతో ఇళ్లకే పరిమితమవుతున్నారు. లేదా ఇతర ప్రాంతాలకు వెళ్లి తల దాచుకుంటున్నారు. స్థానిక రాజకీయాలలో చురుకుగా ఉంటున్న ప్రజాప్రతినిధులు, అమాత్యుల వారసులు కరోనా భయంతో జిల్లాలను విడిచి పెట్టి కుటుంబాలతో నగరాలలో కాలం గడుపుతున్నారట. నిత్యం కనిపించే వారిలో కొందరికి కరోనా బయట పడిన నేపధ్యంలో వారందరూ ఆ నిర్ణయం తీసుకోవటం లో తప్పులేదని.. కరోనా ఉధృతి తగ్గాక మళ్లీ అందరినీ కలుస్తారని వారి సన్నిహితులు అంటున్నారు. ఆంతరంగికులకు, గన్‍మెన్‍లకు కూడా కరోనా బయట పడింది. దీంతో చాలా మంది ప్రజా ప్రతినిధులు, అమాత్యులు హైదరాబాద్‍లో ఎక్కడెక్కడో రహస్యంగా తలదాచుకుంటూ.. తమ ఉనికి బయట పడకుండా.. ఫోన్లకు మాత్రమే అందుబాటులో ఉంటున్నారట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *