Tue. Sep 22nd, 2020

వెల వెల బోతున్న తిరుమల దుకాణాలు

tirumala shops

tirumala shops

పూలు అమ్మిన చోటే.. కట్టెలు అమ్మటం అనే సామెత ఎందరికి వర్తించిందో కానీ.. ఆ సామెత తిరుమలలో దుకాణదారులకు వర్తించిందని చెప్పవద్దు. ఒకప్పుడు దుకాణాదారులతో కళ కళలాడుతూ ఉండేది. ప్రస్తుతం కొనుగోలు చేసేందుకు ఎవరు వస్తారా.. అని దుకాణదారులు ఆశగా ఎదురు చూస్తున్న సంఘటనలు కనిపిస్తున్నాయి. కరోనా వ్యాధి బయట పడక ముందు తిరుమల కొండపై ఎంతో హడావిడి కనిపించేది. కొండపై ఉన్న దుకాణాలు కొనుగోలు చేసేందుకు వచ్చిన భక్తులతో రద్దీగా ఉండేవి. లాక్‍డౌన్‍తో 78 రోజులు దుకాణాలు మూసివేశారు. లాక్‍డౌన్‍ సడలించాక తిరుమల శ్రీవారి దర్శనానికి పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్నారు. వారు వెంటనే శ్రీవారిని దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం అవటంతో తిరుమలలో వ్యాపారాలు దెబ్బ తిన్నాయి.

గతంలో సాధారణ రోజులలో రోజుకు 50 వేల నుండి 70వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునేవారు. వారాంతపు రోజులు, శెలవు దినాలలో భక్తుల సంఖ్య లక్షపైగా ఉండేది. విదేశాల నుండి వేలాది మంది భక్తులు తిరుమలకు వచ్చేవారు. తిరుమల కొండపై ఉన్న దుకాణాలలో ఏదో ఒకటి కొనుగోలు చేసి భక్తులు తిరిగి వెళ్లేవారు. అంతే కాకుండా వ్యాపారులు రోడ్లపై తిరుగుతూ దేవతా మూర్తులు చిత్రపటాలు, ఆట వస్తువులు, చేతికి కట్టుకునే దారాలు అమ్ముకుంటూ జీవనం సాగించేవారు. రోజుకు 2కోట్ల నుండి 4 కోట్ల వరకు తిరుమల కొండపై వ్యాపారం జరిగేది. కరోనా వైరస్‍తో మార్చి 20 వతేదీన శ్రీవారి దర్శనాలను 78 రోజుల పాటు రద్దు చేయటంతో తిరుమలలో దుకాణాలన్నీ మూత పడ్డాయి. జూన్‍ 13వ తేదీ నుండి శ్రీవారి దర్శనాలతో పాటు దుకాణాలు తెరుచుకున్నా రోజుకు పది వేల మంది భక్తులు కూడా రాని నేపధ్యంలో దుకాణాలు తెరిచినా కొనుగోలు లేదు. కనీసం బోణి అయినా కాకపోతుందా.. అని దుకాణ దారులు ఉదయం నుండి రాత్రి వరకు దుకాణాలను తెరిచే ఉంచుతున్నారు.

తిరుమల కొండపై దుకాణదారుల పరిస్తితి కడు దయనీయంగా ఉందని.. ఎప్పుడు వారు ఈపరిస్థితి నుండి బయట పడతారు. కరోనా వ్యాది ఎప్పుడు పూర్తిగా తగ్గుతుందో అప్పటి వరకు తిరుమల కొండపై తాజా పరిస్థితులు ఎదుర్కోక తప్పదని దుకాణదారులు అంచనాకు వచ్చారు. కాలి బాట నుండి శ్రీవారి ఆలయం వరకు వేలాది మంది చిరు వ్యాపారులు ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యాపారంతో జీవించేవారు. గోవింద నామాలు పెట్టేవారి నుండి రోడ్లపై తిరుగుతూ శ్రీవారి చిత్ర పటాలు అమ్మే చిరు వ్యాపారులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. మరో వైపు ట్యాక్సీలపై ఆదారపడిన వారిది కూడా అదే పరిస్థితి. ఇతర ప్రాంతాలలో వ్యాపారులు లాక్‍డౌన్‍ సడలింపులతో మెల్ల మెల్లగా కోలుకుంటూ ఉంటే తిరుమలలో అలాంటి పరిస్థితే కనిపించటం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *