Wed. Oct 21st, 2020

విశాఖలో విజయసాయి నామస్మరణ..!

vijay sai reddy

vijay sai reddy

ఇదిగో ఇప్పుడే మాతో విజయసాయిరెడ్డి గారు మాట్లాడారు.. మా పనులు చక్కపెట్టకుంటే ఆయనకు ఫిర్యాదు చేస్తాం అని అధికారులను బెదిరించి కొంత మంది నాయకులు పనులు చక్కపెట్టుకుంటున్నారు. జిల్లాలో చాలా మంది విజయసాయిరెడ్డి పేరు చెప్పి అధికారులతో పనులు చేయించుకుంటున్నారని.. అందని నోటా ఆయన పేరే వినిపిస్తుందని.. ఇటీవల జరిగిన ఒక సమావేశంలో ఎమ్మెల్యే కన్నబాబు రాజు చెప్పటం జరిగింది. యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ.. విజయసాయిరెడ్డి గారి పేరు చాలా మంది ఉపయోగించుకుంటున్నారని.. అధికారులను భయపెడుతున్నారని.. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. విశాఖ నగరాభివృద్ది సంస్థ ఛైర్మన్‍ ద్రోణం రాజు శ్రీనివాస్‍ మాట్లాడుతూ గోల గోవిందుడిది.. ముడుపులు వెంకన్నవి అన్న చందంగా.. విశాఖ జిల్లాలో పరిస్థితి తయారయిందని.. అంతా విజయసాయిరెడ్డి నామ స్మరణే జపిస్తున్నారని ఆయన చమత్కరించారు.

అదే సమావేశంలో పాల్గొన్న విజయసాయిరెడ్డి స్పందిస్తూ.. తాను ఎవరికి సిఫార్సు చేయటం లేదని.. పలానా పనులు చేయాల్సిందిగా తాను ఏ అధికారికి చెప్పలేదన్నారు. కానీ.. తన పేరు ఉపయోగించుకునే వారు ఎవరైనా సరే.. పనులు చేయవద్దని మాత్రం అధికారులకు విజయసాయిరెడ్డి చెప్పలేదు. సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలు విజయసాయిరెడ్డి వ్యవహారంలో వ్యతిరేకంగా మాట్లాడేందుకు భయపడుతున్నారని పలువురు అధికారులు అంటున్నారు. విశాఖ నగరంతో విజయసాయిరెడ్డికి సంబందం ఏమిటి..? ఆయన పేరును చాలా మంది నాయకులు ఎందుకు ఉపయోగించుకుంటున్నారు. ఎవరెవరు ఏ విధంగా ఉపయోగించుకుని ఆర్దిక లబ్ది పొందారో వివరాలు బయట పడ్డా… అందులో ఏ ఒక్కరినీ విజయసాయిరెడ్డి హెచ్చరించలేదు. దీనర్ధం పరమార్దం ఏమిటి.? తన పేరు ఉపయోగించుకుని పనులు చక్కపెట్టుకోవటం విజయసాయిరెడ్డికి ఇష్టం ఏమో. చిన్న చిన్న పనులను ఆవిధంగా చక్కపెట్టుకుంటే నష్టం ఏమిటని విజయసాయిరెడ్డి భావిస్తున్నారేమో. ఎవరైనా తన పేరు ఉపయోగించుకుని బెదిరింపులకు పాల్పడితే.. ఆ పనులు మీరు చేయద్దు.. వారి వివరాలు నాకు తెలపండి అని ఆయన బాహాటంగా చెప్పలేకపోతున్నారు. ఇదేం పెద్ద విషయం కాదు.. చిన్న చిన్న విషయాలపై ఎందుకు స్పందిచాలని ఆయన భావిస్తున్నారేమో అని కొంతమంది అధికారులు అభిప్రాయం.

ఈవిషయాన్ని విజయసాయిరెడ్డి తేలికగా తీసుకుంటే.. ముందు ముందు ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుందని ఆయన సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ నగరంలో ఎవరెవరు ఏయే పనులు ఆయన పేరుతో చక్కపెట్టుకున్నారు… ఏయే అధికారులు ఎవరి నుండి పనులు చక్కపెట్టారు. దీనికి ఆధారాలు ఏమిటి? బెదిరింపు బాధితులు ఎవరైనా ఫిర్యాదు చేశారా.. ? ఎందుకు ఇంత రాద్దాంతం చేస్తున్నారు అని విజయసాయిరెడ్డి అనుచరులు ఎదురు దాడి చేస్తున్నారు. ఎవరెవరో ఆయన పేరు అడ్డుపెట్టుకుని పనులు చక్కపెట్టుకుంటుంటే.. ఫిర్యాదు చేయాల్సిన అధికారులు వారి పనులు చక్కపెడుతున్నారు. సామి కార్యాలతో పాటు సకార్యాలను కూడా అధికారులు చక్కపెట్టుకుంటున్నారేమో అని విజయసాయిరెడ్డి అనుచరులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జరిగేది గోరంత… ప్రచారం జరుగుతోంది కొండంత. కొంత మంది కావాలని ప్రతిచిన్న సంఘటనను భూతద్దంలో చూపిస్తున్నారని ఆయన అనుచరులు అంటున్నారు. తన పేరు ఉపయోగించి పనులు చక్కపెట్టుకుంటున్న వారి వివరాలను విజయసాయిరెడ్డి తెలుసుకోగలిగితే.. మళ్లీ అలాంటి సంఘటనలు పునరావృతం కావని అధికారులు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *