Sat. Oct 24th, 2020

సచివాలయంలో మళ్లీ కరోనా విజృంభణ..!

Ap-secratriate

Ap-secratriate

సచివాలయంలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. మొదట్లో ఇద్దరికే పరిమితమయిన కరోనా వైరస్‍ ఆ తరువాత 20 మందికి పాకిపోయింది. వారం రోజుల కిందట సచివాలయంలో పనిచేసే వారికి కరోనా టెస్టులు నిర్వహించగా… మళ్లీ పది మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్‍ బయట పడింది. దీంతో సచివాలయ అధికారులలో, ఉద్యోగులలో, అవుట్‍ సోర్సింగ్‍ ఉద్యోగులలో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఒకసారి పరీక్షలు నిర్వహిస్తేనే.. 30 కేసులు బయట పడ్డాయి. రెండో సారి కరోనా పరీక్షలు నిర్వహిస్తే.. ఇంకెన్ని పాజిటివ్‍ కేసులు బయట పడతాయో అని అధికార, ఉద్యోగ వర్గాలలో ఉత్కంఠ నెలకొంది. సచివాలయానికి ముఖ్యమంత్రి రారు.. మంత్రులు కూడా ఎక్కువ మంది రారు. మంత్రి వర్గ సమావేశం రోజు మినహా మిగతా రోజులలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని కూడా రావటం లేదు. ముఖ్యమంత్రి నివాసానికే పరిమితమవుతున్నారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయవాడలోని క్యాంపు ఆఫీసుకే పరిమితమవుతున్నారు. మంత్రులు సచివాలయానికి వస్తున్నారా.. రారా అనే విషయం కూడా వారి ఆంతరంగికులు చెప్పలేకపోతున్నారు. శాఖాదిపతులలో అతి కొద్ది మంది మాత్రమే సచివాలయానికి వస్తున్నారు. అలా వచ్చిన వారిలో మరి కొంతమంది కేవలం రెండు గంటలు మాత్రమే ఉండి వెళుతున్నారు. పట్టు మని పది మంది కూడా సచివాలయానికి శాఖాదిపతులు రావటం లేదని ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. సచివాలయ ఉద్యోగులు మంచి, చెడు చూడవలసిన జిఎడి పొలిటికల్‍ శాఖాదిపతిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రవీణ్‍ ప్రకాష్‍ సిఎం నివాసంలోనే ఎక్కువ కాలం గడుపుతున్నారట. ఆయన తరువాత బాధ్యతలు చూడవలసిన జిఎడి డిప్యూటి కార్యదర్శిజనరల్‍ ఏమీ పట్టనట్లు ఉంటున్నారు. ఇంత దారుణమైన పరిస్థితి పొరుగు రాష్ట్రాల సచివాలయాలలో ఉందో లేదో కానీ అమరావతి సచివాలయంలో స్పష్టంగా ఈ పద్దతి కనిపిస్తుంది.

30 కరోనా పాజిటివ్‍ కేసులకు పరిమితమయిన సచివాలయంలో మరో సారి కరోనా టెస్టులు నిర్వహిస్తే.. ఇంకెన్ని కేసులు బయట పడతాయో. బాధ్యత గల అధికారులు పట్టించుకోరు. ఉద్యోగ సంఘాల నాయకులు ఈ విషయంపై స్పందించేందుకు ముందుకు రారు. రాష్ట్ర సచివాలయంలో ఇంత ఘోరమైన పరిస్థితి ఇంతకు ముందు ఎన్నడూ చూడలేదని ఉద్యోగ సంఘాల నాయకులు కానీ అధికారిని భయపడుతున్నట్లుగా లేదా కొమ్ము కాస్తున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తుందని ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. ప్రభుత్వానికి గుండె కాయ లాంటి సచివాలయంలోనే ఈ విధమైన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంటే.. బయట పరిస్థితి ఇంత కన్నా ఘోరంగా ఉండవచ్చు. పలు మీడియా వారు ఇతర ప్రాంతాలపై ఎక్కువగా దృష్టి సారస్తున్నారే తప్ప సచివాలయంపై దృష్టి పెట్టడం లేదు. సచివాలయ ఉద్యోగులకు, అధికారులకు మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించాలని మెజార్టీ ఉద్యోగులు కోరుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *