Sat. Oct 24th, 2020

రాష్ట్రపతి రేసులో వెంకయ్యనాయుడు..?

VENKAIAH

VENKAIAH

మరో రెండేళ్ళలో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఈ అత్యున్నతమైన రాజ్యాంగ పదవికి బీజేపీ సర్కార్‍ ఎవరిని మనసులో అనుకుందో ఇప్పటికైతే ఎవరికీ తెలియలేదు. నిజానికి మోడీ అధికారంలోకి వచ్చాక బీజేపీ కురు వృధ్ధుడు, తన గురువు అయిన ఎల్కే అద్వానీకి అవకాశం ఇస్తారని అనుకున్నారు. కానీ అనూహ్యంగా రాంనాధ్‍ కోవింద్‍ పేరు తెరపైకి వచ్చింది. ఇది 2017 నాటి ముచ్చట. ఇక రాజకీయాల్లో అప్పటికి బాగా చురుకుగా ఉన్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుని ఉప రాష్ట్రపతిని చేశారు. ఆయన సైతం మొదట ఇష్టపడలేదు కానీ పార్టీ నిర్ణయాన్ని శిరసావహించారు. ఇక ఇప్పటికి మూడేళ్ళు గడిచాయి. వెంకయ్యనాయుడు తెలుగు రాష్ట్రాలకు చెందిన సీనియర్‍ నాయకుడు.ఉప రాష్ట్రపతి నుంచి రాష్ట్రపతి కావడం అంటే అది సంప్రదాయం ఉందంటే ఉంది. లేదంటే లేదు. ఎందుకంటే రాష్ట్రపతులు అంతా అప్పటికి అధికారంలో ఉన్న పార్టీల బలాలు, వారి ఆలోచనల బట్టి ఎంపిక చేయబడతారు. ఇక వెంకయ్యనాయుడు విషయం తీసుకుంటే ఆయన పేరు ఒక దశలో ప్రధాని రేసులోనే వినిపించింది.

అయితే క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుని రాజ్యాంగ పదవిలోకి ఆయన వచ్చేశారు. దాంతో ఆయనకు మిగిలిన అత్యున్నత పీఠం రాష్ట్రపతి మాత్రమే. నిజానికి వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి అవగానే ఇంక ఆయనే కాబోయే రాష్ట్రపతి అన్న ప్రచారం కూడా అప్పట్లో ఓ వైపు సాగింది. పైగా తెలుగువారికి వీవీ గిరి, నీలం సంజీవరెడ్డి తరువాత తరువాత రాష్ట్రపతులు అయిన చరిత్ర లేదు.ఇక ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాష్ట్రపతి కావాలంటే ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది అన్నది వాస్తవం. ప్రెసిడెంట్‍ ఎలక్ట్రోరల్‍ కాలేజిలో వైసీపీకి భారీగానే ఓట్లు ఉన్నాయి. 151 మంది ఎమ్మెల్యేలు, రెండు సభలు కలుపుకుని 28 మంది ఎంపీలతో వైసీపీ బలంగా ఉంది. ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే ముగ్గురు లోక్‍ సభ ఎంపీలు, ఒక రాజ్యసభ సభ సభ్యుడు మాత్రమే ఉన్నారు. ఇక 20 మంది ఎమ్మెల్యేలలో ఆనాటికి ఎంతమంది మిగులుతారో తెలియదు. ఈ క్రమంలో వెంకయ్యనాయుడు సొంత రాష్ట్రం ఏపీ నుంచి ఆయనకు గట్టి బలం కావాలంటే వైసీపీయే కీలకం అన్నది వాస్తవం.ఇక వెంకయ్యనాయుడు వైసీపీ అధికారంలోకి వచ్చాక మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు.

ఏపీలో జరుగుతున్న అభివృధ్ధి కార్యక్రమాలు ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా కరోనా వేళ ఏపీ సర్కార్‍ పెద్ద ఎత్తున టెస్టులు చేయడాన్ని కూడా ఈ మధ్య వెంకయ్యనాయుడు ప్రశంసించారు. అదే విధంగా వైసీపీకి చెందిన కీలకనేత భూమన కరుణాకరరెడ్డితో ఆయన ఫోన్‍ ద్వారా సంభాషించి ఆయన బాగోగులు కరోనా వేళ తెలుసుకున్నారు. ఇక ఏపీ ప్రగతి విషయంలో తన వంతు పాటుపడుతున్నారు. మరి జగన్‍ వెంకయ్యనాయుడుకు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇచ్చారు. ఇక ఒక తెలుగువాడు రాష్ట్రపతి అవుతారు అంటే కచ్చితంగా ఇస్తారని అంటున్నారు. అదే విధంగా ఏపీలో తన బలాన్ని వెంకయ్యనాయుడు గట్టిపరచుకుంటేనే ఆయన అభ్యర్ధిత్వం కూడా బీజేపీ పరిశీలించేందుకు అవకాశాలు ఉంటాయి. మొత్తానికి వెంకయ్యనాయుడు దేశ తొలి పౌరుడు అవుతారన్న చర్చ మాత్రం మళ్లీ ఇపుడు గట్టిగా వినిపిస్తోంది. అది కూడా జగన్‍ మద్దతుతో అని చెబుతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *