Wed. Oct 21st, 2020

కేంద్ర సర్వీసులకు గోపాలకృష్ణ ద్వివేది..?

goapala krishna ias

goapala krishna ias

స్టేట్‍ ఎలక్షన్‍ కమీషనర్‍ నిమ్మగడ్డ రమేష్‍కుమార్‍ను పదవినుండి తప్పించిన విధానంపై హైకోర్టు తప్పుబట్టింది. అంతే కాకుండా.. ఆయనను తప్పించిన విధానం సరికాదని తీర్పు చేప్పిన నేపధ్యంలో ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటీషన్‍ దాఖలు చేయగా.. అక్కడ కూడా అధికారులకు చుక్క ఎదురైంది. అదే విధంగా పంచాయితీ భవనాలకు అధికార పార్టీ రంగులను నాలుగు వారాల లోపల తొలగించకపోతే.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు పంచాయితీ రాజ్‍ మరియు గ్రామీణాభివృద్ది శాఖాదిపతి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయితీ రాజ్‍ మరియు గ్రామీణాభివృది శాఖ కమీషనర్‍ గిరిజా శంకర్‍లపై చర్య తీసుకుంటామని కోర్టు హెచ్చరించింది. అంతే కాకుండా పంచాయితీలకు సంబందించిన కేసులలో గోపాలకృష్ణ ద్వివేదికి అనేక తల నొప్పులు ఎదురవుతున్నాయట. ఈ నేపధ్యంలో కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ఆయన ప్రభుత్వ అనుమతి కోసం దరఖాస్తు చేస్తున్నట్లు అధికార వర్గాల సమాచారం.

ఒకవైపు కోర్టు కేసులతో తలనొప్పి… మరో వైపు ఫ్యామిలీ ఢిల్లీలో ఉంది.. అందువలన నేను కూడా కేంద్ర సర్వీసులకు వెళతాను అంటున్నారట. 2019 ఎన్నికలకు ఆరు నెలల ముందు కేంద్ర సర్వీసుల నుండి రాష్ట్ర సర్వీసులకు వచ్చిన ద్వివేదిని ఏరి కోరి చీఫ్‍ ఎలక్షన్‍ కమీషనర్‍గా నియమించటం జరిగింది. అప్పట్లో ఆయన చంద్రబాబుకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నారని విమర్శలు వచ్చాయి.అంతే కాకుండా జగన్‍ పార్టీ అభ్యర్ధులకు పరోక్షంగా సహకరిస్తున్నారని అప్పటి అధికార పార్టీ నేతలు తప్పుబట్టారు. జగన్‍ ముఖ్యమంత్రి అయ్యాక తనకు సహకరించిన ద్వివేదిని పంచాయితీరాజ్‍ మరియు గ్రామీణాభివృద్ది శాఖాదిపతిగా నియమించారు. అంత వరకు బాగానే ఉంది. అత్యంత కీలక ప్రాధాన్యతగల శాఖను నిర్వహిస్తున్న ద్వివేదికి కోర్టు వేస్తున్న మొట్టికాయలతో తల బొప్పి కట్టింది. ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఆయన ఆందోళన చెందుతున్నారట. ఫ్యామిలీ ఢిల్లీలో ఉన్నప్పుడు ఏకారణాలతో రాష్ట్ర సర్వీసులకు ద్వివేది వచ్చారన్న విషయం ఆ తరువాత జరిగిన సంఘటనలను బట్టి బయట పడిందంటున్నారు అధికారులు.

మళ్లీ అదే ఫ్యామిలీ పేరుతో కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారట. ముఖ్యమంత్రిని కలిసి అనుమతి కోరారని.. అందుకు జగన్‍ సరే అన్నారని, రేపో.. మాపో.. ఆయన దరఖాస్తు చేయబోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ద్వివేది కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని బయటకు పొక్కటంతో సచివాలయంలో అనేక విధాలుగా ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా పంచాయితీ రాజ్‍ మరియు గ్రామీణాభివృద్ది శాఖను సమర్దవంతంగా నిర్వహించలేక చతికిలపడ్డారని పాలకులు భావిస్తున్నారు. కారణాలు ఏమైనప్పటికీ త్వరలో ద్వివేది కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు దరఖాస్తు పెట్టుకోవటం ఖాయమని అధికార వర్గాలు చెప్పుకుంటున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *