Wed. Oct 21st, 2020

రోజుకో ఉత్తర్వుతో..ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఉపాధ్యాయులు..!

school

school

జిల్లాలలో నిన్న మొన్నటి వరకు ఉపాధ్యాయులు నాడు- నేడు పనులతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. జులై 13 నుండి వారంలో ఒకటి లేదా రెండు రోజులు పాఠశాలకు తప్పనిసరిగా రావాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక వైపు జిల్లాలలో కరోనా మహమ్మారితో బయటకు రావాలంటే ప్రతి ఒక్కరూ భయపడే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంతకు ముందు ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలలకు హాజరైన ఉపాధ్యాయులు నాడు-నేడు పనులను నిర్వహించారు. మళ్లీ 13 నుండి పాఠశాలలకు రావాలన్న ఆదేశాలపై ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. స్కూల్‍ ఎడ్యుకేషన్‍ కమీషనర్‍ ఉత్తర్వుల ప్రకారం ప్రధాన ఉపాధ్యాయులు జులై 10వ తేదీలోగా యువ్‍ఐడి సమాచారం అప్‍లోడ్‍ చేయాలి.

నాడు-నేడు కార్యక్రమాలను పని విభజన ద్వారా చేయించాలి. ఈ నెల 31వ తేదీలోగా ఈ పనులు పూర్తి చేయాలి. లైభ్రరీ పుస్తకాల పంపిణీ, ప్రాజెక్టుల పనులు విద్యార్ధులకు ఇవ్వాలి. ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయులు జులై 13వ తేదీ నుండి ప్రతి మంగళవారం పాఠశాలకు హాజరై బ్రిడ్జి కోర్సును పరిశీలించాలి. పాఠశాలలో నాడు-నేడు పనులు ప్రారంభించటానికి ఇసుక కొరత ఏర్పడుతుంది. ఆన్‍లైన్‍లో బుక్‍ చేస్తే.. మూడు వారాలకు కానీ డెలివరీ ఇవ్వటం లేదు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు పనులు చేయటానికి కాంట్రాక్టర్లు ముందుకు రావటం లేదు. ఏదైనా పనులు నాసిరకంగా కనిపిస్తే.. ఉపాధ్యాయులను బాధ్యులు చేస్తున్నారు. మరో వైపు నిధులు విడుదల చేయటం లేదు. ఒకవేళ నిధులు విడుదల అయినా.. పనులు సకాలంలో పూర్తి కావటం లేదు. ప్రభుత్వం విడుదల చేసిన నిధుల ప్రకారం పనులు చేసేందుకు కాంట్ట్రార్లు ముందుకు రావటం లేదు.

ఉన్నతాధికారులు ఇవేమి పట్టించుకోకుండా ఉపాధ్యాయులను ఆదేశిస్తున్నారు. ప్రభుత్వం నుండి వచ్చే రోజుకో ఉత్తర్వుతో ఉపాధ్యాయులు ఆందోళనతో ఉన్నారు. అధికార పార్టీ నాయకులు వాస్తవంగా ఉన్న రేట్లు కంటే మరింత పెంచాలని ఒత్తిడి తెస్తున్నారని ఉపాధ్యాయ సంఘాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఒకవేళ ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేసినా.. క్షేత్ర స్థాయిలో ఇసుక, కూలీల కొరత వేదిస్తుంది. ఒకవైపు కోవిడ్‍-19 విజృంభిస్తున్నా కూడా ఉపాధ్యాయులు పనులు చేస్తున్నా.. అధికారులకు కనికరం ఉండటం లేదు. ఒత్తిళ్లతో ఉపాధ్యాయులు తట్టుకోలేక పోతున్నారు. నాడు-నేడు పనులపై నిరసన వ్యక్తం చేస్తూ.. డీవో కార్యాలయాలను ముట్టడించి సమస్యలు విన్నవించినా.. ఎవరూ స్పందించటం లేదు. అటు కరోనా వ్యాదికి భయపడాలి.. ఇటు అధికారుల వేదింపులకు తట్టుకోవాలి… నాడు-నేడు పనులు పూర్తి చేయటానికి పరిస్థితులు కలిసి రావటం లేదు. అధికారులు రోజుకో విధంగా ఒత్తిడి తెస్తూ ఉపాధ్యాయులను రోజుకో విధంగా హింసిస్తున్నారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *