Wed. Oct 21st, 2020

ఆ కలెక్టర్‍ వ్యవహార శైలిపై అసంతృప్తితో ఎమ్మెల్యేలు..?

collector bhaskar, balineni, mahidhar reddy

collector bhaskar, balineni, mahidhar reddy

మా కలెక్టర్‍ గారు ఎలాంటి రాజసం ప్రదర్శిస్తున్నారో చూడండి.. ప్రజా ప్రతినిధులను ఆహ్వానించకుండా నిర్వహించే సమావేశాలలో ఆయన ఏవిధంగా కుర్చీలో కూర్చుంటున్నారో అని ఫొటో ఆధారాలతో సిఎంవో అధికారుల దృష్టికి కొందరు తీసుకువెళ్లినట్లు సమాచారం. జిల్లా, డివిజన్‍, నియోజకవర్గ అధికారులు హాజరైన ఈ సమావేశంలో ఒక ఉద్యోగి ఫొటోలు తీసి అధికార పార్టీ ప్రజా ప్రతినిధులకు, మంత్రికి పంపిచటం జరిగిందని బయటకు పొక్కింది. దీంతో ఆగ్రహం చెందిన ప్రజా ప్రతినిధులు ఆ ఫొటోను సిఎంవో అధికారులకు పంపి మా కలెక్టర్‍ గారి పద్దతి ఎలా ఉందో చూడండి. ఆయన పని తీరు బాలేదని ఎప్పటి నుండో చెబుతున్నాం…మీరు వినిపించుకోవటం లేదు అని సిఎంవో అధికారులతో ప్రజా ప్రతినిధులు నిష్టూరమాడారట. అసలు విషయానికి వస్తే.. ప్రకాశం జిల్లా కలెక్టర్‍గా పోలా భాస్కర్‍ బాధ్యతలు స్వీకరించి సంవత్సరం పూర్తయింది. ఆయన పనితీరును ఎక్కువ మంది అధికార ప్రజా ప్రతినిధులు వ్యతిరేకిస్తున్నారట.

కొన్ని అంశాలలో ఉన్నతాధికారులు కూడా కలెక్టర్‍ భాస్కర్‍ పనితీరుపై అసంతృప్తి వ్యక్తంచేసినట్లు తెలిసింది.. ప్రజా ప్రతినిధులతో సమన్వయంగా వ్యవహరించకపోవటమే సమస్యలకు కారణమని ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారట. ప్రస్తుతం జరుగుతున్న ఉపాధి పనుల సమీక్షలను ప్రజా ప్రతినిధులు లేకుండా నిర్వహిస్తున్నారట. మంత్రి బాలినేని ప్రాతినిధ్యం వహిస్తున్న ఒంగోలు నియోజకవర్గంలో జరగవలసిన సమావేశాన్ని టంగుటూరులో.. ఎమ్మెల్యే మహిదర్‍రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కందుకూరు నియోజకవర్గంలో జరగాల్సిన సమావేశాన్ని కొండేపి నియోజకవర్గ పరిదిలోని సింగరాయకొండలో ఏర్పాటు చేయటంపై స్థానిక అధికార పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేయటంతో.. ఆ రెండు సమావేశాలను వాయిదా వేసి ఒంగోలులో నిర్వహించాలని కలెక్టర్‍ నిర్ణయం తీసుకున్నారట.

అసలు విషయం ఏమిటంటే.. ఈ సమావేశాలకు మంత్రికి, ఎమ్మెల్యేలకు సమాచారం లేదు. ఆహ్వానం కూడా పంపలేదు. శాసనసభ సమావేశాలు, రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్న నేపధ్యంలో ఎమ్మెల్యేలు అందరూ తప్పనిసరిగా అమరావతిలో ఉంటారని తెలిసి కూడా జూన్‍ 18వ తేదీన సమావేశాలు ఏర్పాటు చేయటంలో మర్మం ఏమిటి..? అని ఎమ్మెల్యేలు, మంత్రుల అనుచరులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా మహిదర్‍రెడ్డి సమావేశానికి రాకూడదనే 18వ తేదీని నిర్ణయించారని వారు అంటున్నారు. అభివృద్ది పనులకు సంబందించిన సమావేశాలకు అధికార ప్రజా ప్రతినిధులను దూరంగా ఉంచటంపై వారిలో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల తాహసీల్దార్ల బదిలీలు కూడా ప్రజా ప్రతినిధుల సూచనలకు భిన్నంగా జరగటంతో వారు సిఎంవో అధికారులకు ఫిర్యాదు చేశారట.

ఈవిషయంపై సీఎం, సిఎంవో అధికారులు కూడా మంత్రి బాలినేనితో చర్చించినట్లు బయటకు పొక్కింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్థలాల పంపిణీ విషయంలో కూడా జిల్లా అదికారుల వ్యవహారశైలిపై ఉన్నతాధికారులు అనుమానం వ్యక్తం చేసినట్లు తెలిసింది. గత వారం రోజుల నుండి జిల్లా స్థాయి అధికారులు.. నియోజకవర్గాల అధికారులకు ఫోన్లు చేసి లబ్ది దారుల సంఖ్యను కుదించాలని సూచించటంపై ప్రజా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా ప్రకాశం జిల్లా కలెక్టర్‍ పోలా భాస్కర్‍ను బదిలీ చేసేందుకు రంగం సిద్దమైందని.. అసెంబ్లీ సమావేశాల అనంతరం భాస్కర్‍కు ఉద్వాసన తప్పదని కొంతమంది ఎమ్మెల్యేలు తమ అనుచరులతో అంటున్నారట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *