Tue. Sep 22nd, 2020

అయ్యన్న.. జగన్‍కు టార్గెట్‍ అయ్యారా..?

ys.jagan, ayyanapathrudu

ys.jagan, ayyanapathrudu

చంద్రబాబుపై మీరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అప్పుడప్పుడు జరుగుతున్న సంఘటనలు తప్పుబడుతున్నారు. మిమ్ములను పార్టీ నుండి సస్పెండ్‍ చేస్తారేమో అని మాజీ మంత్రిచింతకాయల అయ్యన్న పాత్రుడిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా… నేను పార్టీ స్థాపించినప్పటి నుండి పార్టీలో ఉన్నాను. నా తరువాతే చంద్రబాబు పార్టీలోకి వచ్చారు. టిడిపి మా అందరిది. ముఖ్యంగా బిసి వర్గాలది. బిసి వర్గాలకు రాజకీయంగా, అధికారంగా పెద్దపీట వేసింది టిడిపి ప్రభుత్వమే. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతాను.. నాపై చంద్రబాబు ఎందుకు చర్య తీసుకుంటారు. పార్టీ శ్రేయస్సును కోరుకునే వారిలో చాలా మంది కన్నా ముందు ఉంటాను. నాకు వెన్నుపోటు రాజకీయాలు తెలియవు. పార్టీలో జరుగుతున్న తప్పులను ఎత్తి చూపానే తప్ప నేను మా అధినేత చంద్రబాబును వ్యతిరేకించటం లేదు. పార్టీని దిక్కరించటం లేదు అని ఘాటుగా చెప్పిన ఘనత మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడుదే. ఆయన ఆరు దఫాలు ఎన్నికలలో విజయం సాధించారు. మూడు దఫాలు ఓడిపోయారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. 1983 నుండి 2019 వరకు జరిగిన ఎన్నికలలో… 83,85,94,99,2004,2014లలో విజయం సాధించి మంత్రి పదవి కూడా నిర్వహించిన చింతకాయల అయ్యన్న పాత్రుడిని పాలకులు టార్గెట్‍గా పెట్టుకున్నారని.. ఇటీవల జరిగిన సంఘటనల వలన స్పష్టమవుతుందంటున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. ఏ ఏడాది పాలనలో అయ్యన్నపై ఏడు కేసులు నమోదు అయ్యాయి. గత వారంలోనే మూడు కేసులు నమోదు చేశారంటే.. ప్రభుత్వానికి అయ్యన్న టార్గెట్‍ అని చెప్పవచ్చంటున్నారు రాజకీయ పరిశీలకులు. జగన్‍ ప్రభుత్వంపై అయ్యన్న ఘాటైన విమర్శలు చేయటమే దీనికి కారణమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. పొలిట్‍బ్యూరో సభ్యుడైన అయ్యన్నను టార్గెట్‍చేస్తున్నా.. ఆయన వెనకడుగు వేయటం లేదు. ఆయన ముక్కసూటిగా మాట్లాడతారని.. స్వపక్షీయులను కూడా ఆయన విడిచి పెట్టరని పేరుంది. జగన్‍ ప్రభుత్వ వైఫల్యాలు, పాలకులు తీసుకున్న నిర్ణయాలపై న్యాయస్థానం ఇస్తున్న తీర్పులను ప్రశంసిస్తూ.. అయ్యన్నపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడంతో ఆయనను టార్గెట్‍ చేశారని టిడిపి వర్గీయులు ఆరోపిస్తున్నారు. అధికారంలో ఉన్నా.. లేకున్నా.. బహిరంగ సభలలో, మీడియా సమావేశాలలో అయ్యన్న దూకుడుగా మాట్లాడుతుంటారు. ఆయన బహిరంగ సభలలో చేసిన ప్రసంగాలు, మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపైనే ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి.

2019ఎన్నికలలో ఓటమి అనంతరం కొంతకాలం మౌనంగా ఉన్న అయ్యన్న.. ఇటీవల కాలంలో జగన్‍ ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇటీవల ఇళ్ల స్థలాల కోసం చేపట్టిన స్థలాల సేకరణలో అవినీతి జరిగినట్లు మీడియా సమావేశంలో మాట్లాడటంతో.. తమను కించపరిచారంటూ అట్రాసిటీ కేసును నమోదు చేశారు పోలీసులు. ఆతరువాత అయ్యన్న కోవిడ్‍ నిబందనలు ఉల్లంఘించారని కేసు నమోదు అయింది.. అంతే కాకుండా తనను కించపరిచేలా అయ్యన్న మాట్లాడారంటూ మునిసిపల్‍ కమీషనర్‍ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. దీనిని బట్టి అయ్యన్న పాత్రుడుని ప్రభుత్వం టార్గెట్‍ చేసిందని స్పష్టమవుతుందంటున్నారు తెలుగుదేశం నాయకులు. ప్రభుత్వ తప్పిదాలపై అయ్యన్న మాట్లాడుతూనే ఉంటారు… ఎవరో ఒకరు ఫిర్యాదు చేస్తూనే ఉంటారు.. పోలీసులు కేసు నమోదు చేస్తూనే ఉంటారు. ఎంత కాలం ఈ విధంగా జరిగినా.. అయ్యన్న వెనకడుగు వేయరు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం ఖాయం అంటున్నారు ఆయన ముఖ్యఅనుచరులు, స్థానిక సంస్థల మాజీ ప్రతినిధులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *