Tue. Sep 22nd, 2020

ఆళ్లకు మంత్రి పదవి దక్కనట్లేనా..?

ALLA-RAMA-KRISHNA-REDDY

ALLA-RAMA-KRISHNA-REDDY

రాజ్యసభకు అయోధ్యరామిరెడ్డిని ఎంపిక చేయటంతో ఆయనకు దగ్గర బందువైన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి దక్కే అవకాశాలను శాశ్వతంగా మూసి వేసినట్లే అని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు తమ సన్నిహితులతో తెర వెనుక చెబుతున్నారట. ఎన్నికల ప్రచార సమయంలో మంగళగిరిలో జరిగిన ప్రచారంలో టిడిపి అభ్యర్ధి నారాలోకేష్‍ను ఆళ్ల రామకృష్ణారెడ్డి ఓడించగలిగితే… మంత్రి పదవి తప్పకుండా ఇస్తానని అప్పట్లో జగన్‍ ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చాక.. సామాజికవర్గాల సరితూకం నేపధ్యంలో ఆళ్లకు మంత్రి పదవి ఇవ్వలేకపోయారు. లోకేష్‍ను మా నాయకుడు ఓడించారు.. మంత్రి పదవి దక్కటం ఖాయం.

గుంటూరు జిల్లాను మా నాయకుడు అధికారంగా, రాజకీయంగా శాసిస్తారు అని గొప్పలు చెప్పుకున్న ఆళ్ల అనుచరుల కోరిక నెరవేరలేదు. ఎప్పుడైతే ఆళ్ల రామకృష్ణారెడ్డి బందువైన అయోధ్యరామిరెడ్డికి రాజ్యసభ పదవి ఇచ్చారో.. అప్పుడే ఆళ్లకు అవకాశాలు తెరమరుగు అయినట్లే అని స్పష్టమయింది అంటున్నారు ఆ పార్టీ నాయకులు. కానీ గుంటూరు జిల్లాలో ఇప్పటి వరకు ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ.. తెర వెనుక ముఖ్యమంత్రి, మంత్రి ఆళ్ల రామకృష్ణారెడ్డే అని ఆ ఇద్దరు మంత్రుల ఆంతరంగికులు తెర వెనుక ఉండి చెబుతుంటారు. మోపిదేవి వెంకటరమణ రేపల్లె దాటి రారు. మహిళా హోంమంత్రి సుచరిత పత్తిపాడు దాటి ముందుకు వెళ్లలేరు. గుంటూరు జిల్లా అధికార యంత్రాంగం మొత్తం ఆళ్ల సూచనలను అమలు చేస్తుందని ప్రచారం ఉంది. ఇలాంటి పరిస్థితులు ఉన్న నేపధ్యంలో మంత్రి పదవి అవసరమా..? మంత్రి పదవి లేని సూపర్‍ మంత్రిగా ఒక వెలుగు వెలుగుతున్నారు. ఇలాంటి పరిస్థితులున్న నేపధ్యంలో మంత్రి పదవి మా నాయకుడు ఆళ్లకు ఇచ్చినా.. పరవాలేదు.. ఇవ్వపోయినా.. నష్టం లేదు. మరెవరికైనా మంత్రి పదవి ఇచ్చినా మా నాయకుడుకు పోయేది ఏమీ లేదని ఆళ్ల అనుచరులే చెప్పుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *